ఆ మహా భారతమును ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, అధ్యాత్మవిదులు వేదాంత గ్రంధమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంధమని, ఐతిహాసికులు
ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమనీ,
ప్రశంశించారు.
వ్యాసభారతంలో మొత్తం 100 పర్వములు ఉన్నవి. అవి 1. పౌష్యము 2.పౌలోమము, 3. ఆస్తీకము, 4. ఆదివంశావతారము, 5.సంభవపర్వము, 6.జతుగృహదాహము, 7. హైండింబము, 8.బకవధ, 9.చైత్రరథము, 10.ద్రౌపదీస్వయంవరము, 11.వైవాహికము, 12.విదురాగమనము, 13.రాజ్యార్థలాభము, 14. అర్జున తీర్థయాత్ర, 15.సుభద్రా కల్యాణము, 16.హరణ హారిక, 17.ఖాండవదహనము, 18.మయ దర్శనము, 19.సభాపర్వము, 20. మంత్రపర్వము, 21.జరాసంధవధ, 22.దిగ్విజయము, 23.రాజసూయము, 24.బర్ద్యా భిహరణము, 25.శిశుపాలవధ, 26.ద్యూతము, 27.అనుద్యూతము, 28. ఆరణ్యము, 29.కిమ్మీరవధ, 30.కైరాతం, 31. ఇంద్రలోకాభిగమనము, 32.ధర్మజతీర్థయాత్ర, 33జటాసుర వధ, 34. యక్ష యుద్ధం, 35.అజగరము, 36.మార్కండేయోపాఖ్యానము, 37.సత్యాద్రౌపదీ సంవాదము, 38.ఘోషయాత్ర, 39.ప్రాయోపవేశము, 40.జొహిద్రోణకాఖ్యానము, 41. ద్రౌపదీహరణము, 42.కుండలాహరణము, 43. ఆరణ్యము, 44.వైరాటము, 45.కీచకవధ, 46.గోగ్రహణము, 47.అభిమన్యువివాహం, 48. ఉద్యోగము, 49.సంజయయానము, 50.ధృతరాష్ట్ర ప్రజాగరణము, 51.సానత్సుజాతము, 52. యానసంధి, 53.భగవద్యానము, 54.సేనానిర్యాత్ర, 55. ఉలూకదూతాభిగమనము, 56.సమరథ, అతిరథ సంఖ్యానము, 57.కర్ణభీష్మ వివాదము, 58.అంబోపాఖ్యానము, 59.జంబూఖండవినిర్మాణము,
60.భూమి పర్వము, 61.భీష్మాభిషేకము, 62.భగవద్గీత, 63.భీష్మవధ, 64. ద్రోణాభిషేకము, 65.సంశప్తక వధ, 66.అభిమన్యు వధ, 67.ప్రతిజ్ఞాపర్వము, 68.
జయద్రధ వధ, 69.ఘటోత్క చవధ, 70.ద్రోణ వధ,
71.నారాయణాస్త్ర ప్రయోగము, 72.కర్ణపర్వము, 73.శల్యపర్వము, 74. హదప్రవేశము, 75.గదాయుద్ధము, 76.సారస్వతము, 77.సౌప్తికపర్వము, 78.వైషీకము, 79.జలప్రదానము, 80.స్త్రీపర్వము, 81. శ్రాద్ధ పర్వము, 82.రాజ్యాభిషేకము, 83.చార్వాక నిగ్రహము, 84.గృహప్రవిభాగము, 85.శాంతిపర్వము, 86.రాజధర్మానుకీర్తనము, 87. ఆపద్ధర్మము, 88. మోక్ష ధర్మము, 89.ఆనుశాసనికము,90. భీష్మస్వర్గారోహణము,
91.ఆశ్వమేధికము, 92 అనుగీత, 93.ఆశ్రమవాసము, 94. పుత్ర సందర్శనము,95. నారదాగమనము, 96. మౌసలము, 97.మహాప్రస్థానికము, 98.స్వర్గారోహణము, 99.హరివంశము, 100.భవిష్యత్పర్వము.
మహాభారతమును వ్యాసుడు మూడు సంవత్సరములు రచించాడు. ఈ మహా భారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహా మునిని, పితృ లోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వయక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన శుక మహర్షిని, సర్వలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు వ్యాసుడు.
పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు ఐదు రోజులు, కర్ణుడు రెండు రోజులు, శల్యుడు అర్థరోజు, సేనా నాయకత్వము
వహించారు. మిగిలిన సగము దినము భీముడు, సుయోధనుడు గదాయుద్ధము చేసారు.
ఈ మహా యుద్ధములో పాండవ పక్షమున ఏడు అక్షౌహిణులు, కౌరవ పక్షమున పదకొండు అక్షౌహిణుల సైన్యము పాల్గొన్నారు. శమంత పంచకము అనే ప్రదేశములో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 అక్షౌహిణుల
పైన్యము మరణించారు.” అని సూతి చెప్పగా శౌనకాది మహామునులు ఇలా
అడిగారు.
“అనఘా! 18 అక్షౌహిణులు అన్నారు, శమంతక పంచకము అన్నారు. వాటి అర్ధం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది. కౌరవ పాండవులకు వైరము ఎందుకు ఏర్పడింది. ఈ భీష్ముడు ఎవరు. వివరంగా తెలపండి.” అని అడిగారు. సూతుడు శౌనకాది మహా మునులకు ఇలా చెప్పసాగాడు.
త్రేతాయుగము ద్వాపర యుగము సంధి కాలంలో మదించిన ద్వేషంతో పరశు రాముడు ఇరవై ఒక్క సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం ఏడు పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణము
విడిచాడు. దానితో పరశురామునికి
క్షత్రియ కులము మీద ఉన్న కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన
ప్రదేశమునకు శమంత పంచకము అని పేరు వచ్చింది.
ఇంక సైన్య విశేషములు చెబుతాను వినండి.
ఒక రథము, ఒక ఏనుగు, మూడు హయములు, ఐదుగురు సైనికులు కలిసి పత్తి అని
పిలుస్తారు. అటువంటి పత్తులు మూడైతే సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖములు మూడైతే గుల్మము అంటారు. అలాంటి గుల్మములు మూడు కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు మూడైతే వాహిని అవుతుంది. మూడు వాహినులు కలిస్తే పృతనము అవుతుంది. మూడు పృతనములు ఒక చమువు. మూడు చమువులు ఒక అనీకిని. అటువంటి
అనీకినులు పది అయితే అక్షౌహిణి అవుతుంది. అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65.610 హయములు (గుర్రములు), 1,09,350 భటులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. అటువంటి లక్షౌహిణులు
పదునెనిమిది. పదునెనిమిది అక్షౌహిణీల సైన్యముతో కురు వీరులు యుద్ధం చేసారు కాబట్టి ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని కూడా పేరు వచ్చింది. ఇదీ మహాభారత యుద్ధ సైన్యవిశేషము.
ఇంక భారత కధను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ
జనమేజయుడు ఒకసారి ఒక మహా యజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్లు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేసారు.